ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
తమను పర్మినెంట్ చేయాలని రోడ్లు శుభ్రం
కరీంనగర్ జిల్లా – రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. వీరు చేపట్టిన నిరసన శుక్రవారం నాటికి 11వ రోజులకు చేరుకుంది.
గత ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డి తమను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చాడని, కానీ సీఎం అయ్యాక చప్పుడు చేయడం లేదంటూ వాపోయారు. గత కొంత కాలం నుంచీ తాము నిరసన తెలియ చేస్తూ వచ్చామని, అదిగో ఇదిగో అంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెగ్యులర్ టీచర్లు, హెడ్మాస్టర్లతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఇదిలా ఉండగా ప్రతి జిల్లా కేంద్రాలలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇవాళ నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన తెలిపారు.
రోడ్లను ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమను పర్మినెంట్ చేసేంత దాకా ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు.