ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
జామ కాయలు అమ్ముతూ ఆందోళన
కరీంనగర్ జిల్లా – తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇవాల్టితో 10 రోజులకు పైగా కొనసాగుతోంది సమ్మె. నిరవధిక ఆందోళన బాట పట్టిన ఉద్యోగులకు బాసటగా నిలిచారు బీఆర్ఎస్ నేతలు.
ఇదిలా ఉండగా గురువారం నిర్మల్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట వినూత్న నిరసన చేపట్టారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని ముందు పెట్టి జామ కాయలు అమ్మారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టినా సర్కార్ పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తామంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు తన హామీని అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు.
ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎందుకు స్పందించడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఇకనైనా భేషజాలకు పోకుండా వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పేద పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు.