ప్రాథమికంగా వెల్లడించిన రైల్వే కమిటీ
న్యూఢిల్లీ – ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనపై కీలక అప్ డేట్ వచ్చింది. ఈ ఘటనలో 18 మందికి పైగా మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేంద్రం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
స్టేషన్ లో ఇచ్చిన ప్లాట్ ఫారమ్ అనౌన్స్ మెంట్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఒక ప్లాట్ ఫారమ్ మీదకు వచ్చే ట్రైన్ మరో ప్లాట్ ఫారమ్ మీదకు వస్తుందంటూ చెప్పడంతోనే ప్రయాణీకులు పరుగులు తీశారని, తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సోమవారం నియమించబడిన రైల్వే కమిటీ ప్రాథమికంగా దర్యాప్తు చేసింది. ఈ తాత్కాలిక నివేదికను తక్షణమే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు అందజేసింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ.
‘ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫాంపై ప్రత్యేక రైలును ప్రకటించారు. ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగింది. 18 మంది చనిపోయారు’ అని వెల్లడించింది.