NEWSINTERNATIONAL

పాకిస్తాన్ యాచ‌కుల‌పై ‘సౌదీ’ సీరియ‌స్

Share it with your family & friends

తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని వార్నింగ్

సౌదీ అరేబియా – పాకిస్తాన్ దేశానికి బిగ్ షాక్ త‌గిలింది. మ‌రో ముస్లిం దేశం సౌదీ అరేబియా ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ప్ర‌ధానంగా త‌మ దేశానికి పాకిస్తాన్ నుంచి యాచ‌కుల రాక పెరిగింద‌ని, వారిని పాకిస్తాన్ దేశం క‌ట్ట‌డి చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

హజ్ యాత్ర ముసుగులో సౌదీ అరేబియా లోకి అడుగుపెట్టిన పాకిస్థానీ బిచ్చగాళ్ల (యాచ‌కుల) పై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది.

సౌదీఅరేబియా హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌ను ఉమ్రా వీసాల ద్వారా యాచకులు త‌మ దేశంలోకి ప్రవేశించకుండా అరికట్టాలని వార్నింగ్ ఇచ్చింది, ఇది ఆపక పోతే, మొత్తం మీద పాకిస్తాన్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.

ఈ ఉమ్రా పర్యటనలను సులభతరం చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించే , చట్టపరమైన పర్యవేక్షణలో వాటిని తీసుకురావడానికి ‘ఉమ్రా చట్టం’ని ప్రవేశ పెట్టడం ద్వారా పాకిస్థాన్ ప్రతిస్పందించింది.

విదేశీ పాకిస్థానీయుల మంత్రిత్వ శాఖ ప్రకారం, విదేశాల నుండి పట్టుబడిన 90 శాతం యాచకులలో పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నారు. మక్కా గ్రాండ్ మసీదు నుండి అరెస్టు చేయబడిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్తాన్ నుండి వచ్చారని తేలింది.

ఇదిలా ఉండ‌గా ముల్తాన్ ఎయిర్ పోర్ట్ లో ఉమ్రా వెళ్లే విమానంలో ఎక్కేందుకు ప్ర‌య‌త్నం చేసిన 24 మంది యాచ‌కుల‌ను ప‌ట్టుకున్నారు. వారిని ప్ర‌శ్నించ‌గా సౌదీని సంద‌ర్శించేందుకు త‌మ ఏకైక ఉద్దేశ్యం అడుక్కోవ‌డ‌మేనని అంగీక‌రించ‌డం విశేషం.