అంగరంగ వైభవోపేతం కళ్యాణోత్సవం
విజయవాడ – సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించిన వాడు. ఆది దంపతులైన శివ పార్వతులకు తనయుడైన ఈ స్వామి దేవగణానికి సర్వ సేనాధిపతిగా సర్వ శక్తిమంతుడై కొనియాడబడ్డాడు. సర్ప రూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు, రాహువునకు అధిష్టాన దేవతయై ఉన్నారు.
మానవ దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మానవ శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి ఆది దైవం. కుండలినీ శక్తి మానవుని నడిపిస్తుంది. కుజుడు మానవులకు శక్తిని , ధనాన్ని, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమ కూరుతాయిని విశ్వాసం.
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపుడు కావడంవల్ల, సర్ప గ్రహాలైన రాహుకే తువులు సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటారని, అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించ బడుతోందని పురాణోక్తి.
షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వలన అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి, సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
ఫాల్గుణ శుక్ల పక్ష షష్టిని పురస్కరించుకుని బుధవారం ఉదయం మహ మండపం 7వ అంతస్తు లో మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ సేవలో భక్తులు విశేషముగా పాల్గొని, శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు.