SPORTS

స‌న్ రైజ‌ర్స్ ప్లాప్ షో

Share it with your family & friends

స‌మిష్టిగా ప‌రాజ‌యం

చెన్నై – ఐపీఎల్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో దుమ్ము రేపుతుంద‌ని ఆశించిన ఫ్యాన్స్ కు తీవ్ర‌మైన నిరాశ‌ను మ‌గిల్చింది ప్యాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. చెన్నై లోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఈ కీల‌క మ్యాచ్ లో ఏ మాత్రం పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ లేక పోయారు.

కోల్ క‌తా బౌల‌ర్ల దెబ్బ‌కు ప‌రుగులు చేయ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు. ఒక‌రా ఇద్ద‌రా ఏకంగా ఏడుగురు ప్లేయ‌ర్లు సింగిట్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. న‌లుగురు మాత్రం రెండు అంకెల‌ను దాటారు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు బౌల‌ర్లు ఏ ర‌కంగా డామినేట్ చేశారో.

నిన్న‌టి దాకా 17వ సీజ‌న్ లో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించిన వీరేనా ఇలా చేష్ట‌లుడిగి పోయిందంటూ ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ వాపోయారు. ఇక ఎలాగైనా స‌రే క‌ప్ గెలుస్తుంద‌ని ఆశించిన ఎస్ ఆర్ హెచ్ సిఈవో కావ్య మార‌న్ కంట త‌డి పెట్టారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడ‌కుండానే చాప చుట్టేశారు. 18.1 ఓవ‌ర్ల‌లోనే 113 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టారు.

సోష‌ల్ మీడియాలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ట్రోలింగ్ కు గుర‌వుతోంది. ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఆద్యంత‌మూ ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. విజేత‌గా నిలిచింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది మూడోసారి కావ‌డం విశేషం.