వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ప్రకటించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం
ఢిల్లీ – కోల్ కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు కలకలం రేపిన తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రత, ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి సంచలన ప్రకటన వెలువరించింది.
ఆస్పత్రుల భద్రతపై జాతీయ టాస్క్ ఫోర్స్ ను భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ఏర్పాటు చేసింది. మూడు వారాల లోగా మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ తన తుది నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రస్తుత చట్టాలు వైద్యుల సంస్థాగత భద్రతను తగినంతగా పరిష్కరించడం లేదని పేర్కొంది. టాస్క్‌ఫోర్స్‌లో డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, ప్రొఫెసర్ పల్లవి సప్రే, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ను నియమించింది సుప్రీంకోర్టు.
టాస్క్‌ఫోర్స్‌లోని ఎక్స్-అఫీషియో సభ్యులలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్ పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఉంటారు.
భద్రత, పని పరిస్థితులు, వైద్య నిపుణుల శ్రేయస్సు , ఇతర సహ సంబంధ విషయాలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ సిఫార్సులు చేస్తుందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చెప్పారు.