ఏపీ..ఢిల్లీ..జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు నోటీస్
న్యూఢిల్లీ – సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజలను తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వెంటనే వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
మార్చి 7వ తేదీన విచారణకు వర్చువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది .
ప్రజల ఆరోగ్యం గురించి సోయి లేక పోతే ఎలా అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీని కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రభుత్వాలు తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనల పట్ల చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నాయని నిలదీసింది.
పౌరుల ఆరోగ్యం అనేది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అని తెలుసుకుంటే మంచిదని, ఇకనైనా జవాబుదారీతనంతో ఉండాలని స్పష్టం చేసింది. లేక పోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు.