లడ్డూ వ్యవహారం ప్రత్యేక విచారణకు ఆదేశం
సంచలన తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించిన కేసుపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం. ఈ సందర్బంగా సంచలన తీర్పు వెలువరించింది.
ఈ సందర్బంగా లడ్డూ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక విచారణ చేపట్టాలని ఆదేశించింది. మొత్తం ఐదుగురితో బృందాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఐదుగురిలో సీబీఐ డైరెక్టర్ నియమించే ఇద్దరు సీబీఐ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ఐఎఫ్ఎస్ఎస్ఏకు చెందిన మరొక నిపుణుడితో ఏర్పాటు చేయాలని ఆదేశించింది ధర్మాసనం.
ఐదుగురు కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అనంతరం పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, అందుకే రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర దర్యాప్తు అవసరమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది ధర్మాసనం. దీనిపై రాజకీయ నాటకం అక్కర్లేదని స్పష్టం చేసింది.