రేషన్ తో పాటు ఉపాధి కల్పించండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ – దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక సూచన చేసింది. ఉచిత రేషన్ కార్డులు కాదని ముందు ఉపాధి కల్పించాలని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఇచ్చేది రాష్ట్రాలని, ఆ కార్డులపై 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇచ్చేది కేంద్రమని పేర్కొంది. ఆ ధాన్యానికి రాష్ట్రాలు ఏమైనా చెల్లిస్తున్నాయా అని ప్రశ్నించింది.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలపై సీరియస్ కామెంట్స్ చేసింది. ప్రజలను మభ్య పెట్టేందుకు రేషన్ కార్డులు జారీ చేస్తుంటాయని వ్యాఖ్యానించింది. 80 మిలియన్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మంది పేదలకు కేంద్రం రేషన్ అందిస్తోంది . ఇందుకు సంబంధించిన దావాపై కోర్టు విచారణ చేపట్టింది. పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించడానికి బదులుగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని కేంద్రానికి సూచించింది.
ఉచిత రేషన్ అందించమని రాష్ట్రాలను అడిగితే, వారిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఉటంకిస్తూ చేయలేమని చెబుతారు, అందువల్ల మరింత ఉపాధిని సృష్టించడంపై దృష్టి పెట్టాలి అని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్రం పేదలకు గోధుమలు, బియ్యం రూపంలో ఉచిత రేషన్ అందిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.