ఉప ఎన్నికలు రావంటూ ప్రకటన
ఢిల్లీ – బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక బాధ్యతా యుతమైన పదవిలో ఉన్న మీరు ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడింది. అసెంబ్లీ సాక్షిగా ఉప ఎన్నికలు రావంటూ సీఎం చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టుకు వీడియోను సమర్పించారు బీఆర్ఎస్ తరపు లాయర్ ఆర్యమ సుందరం. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ వైపు సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కేసు నడుస్తోంది. ఇంకా తుది తీర్పు వెలువడలేదు. వాదనలు కొనసాగుతున్నాయి. అయినా సీఎంగా మీరు ఎందుకు నోరు జారారంటూ ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని, కొంత సంయమనం పాటించాలని హితవు పలికింది. రేవంత్ రెడ్డి ఇలాగే మాట్లాడుతూ పోతే కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రధాన న్యాయమూర్తి గవాయ్. తాము ఇప్పటి దాకా సంయమనం పాటిస్తూ వచ్చామని, మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలన్నారు.