రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త – సుప్రీంకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ప్రధాన న్యాయ స్థానంపై అవాకులు చెవాకులు ఎలా పేలుతారంటూ ప్రశ్నించింది. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా అని నిలదీసింది. ఈసారి మొదటిసారి తప్పు కింద క్షమిస్తున్నామని ఇంకోసారి నోరు జారితే , అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందించారు రేవంత్ రెడ్డి. 17 నెలల పాటు జైలులో ఉన్న సిసోడియా, 6 నెలల పాటు ఉన్న కేజ్రీవాల్ కు బెయిల్ రావడంలో ఆలస్యం అయ్యిందని , కానీ బీజేపీ సపోర్ట్ తో కవితకు త్వరగా బెయిల్ వచ్చిందనేలా వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. దీంతో తాను కావాలని అనలేదని క్షమాపణలు చెబుతున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్బంగా ఒకరిపై లేదా సంస్థపై విమర్శలు చేసేటప్పుడు ముందూ వెనుకా ఆలోచించి చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.