కోల్ కతా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం
నిప్పులు చెరిగిన సీజేఐ డీవై చంద్రచూడ్
ఢిల్లీ – ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిందని అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఈ కేసును సీజేఐ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక ప్రశ్నలు సంధించారు సీజేఐ. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
సీజేఐ సంధించిన ప్రశ్నలకు ఆయన కొంత సమయం ఆలోచించి చెప్పాల్సి వచ్చింది. డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ జెబి పార్దివాలా కీలకమైన ప్రశ్నలను సంధించారు.
జస్టిస్ పార్దివాలా మాట్లాడుతూ మొదటి ఇన్‌ఫార్మర్ ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? మీరు అతని పేరు చెప్పగలరా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరు నమోదు చేశారో చెప్పగలరా అని అడిగారు.
రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉండకూడదు… ఎవరి ఫిర్యాదును మొదటి ఫిర్యాదుగా పరిగణిస్తారో చెప్పండి? ఏ సమయంలో నమోదు చేయబడింది? అన్నది తెలియాలి.
సీజేఐ చంద్రచూడ్: మృత దేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం తల్లిదండ్రులకు ఎప్పుడు అప్పగించారని నిలదీశారు.
మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం రాత్రి 8:30 గంటలకు అప్పగించారు. రాత్రి 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది… మృత దేహాన్ని దహన సంస్కారాలకు అప్పగించిన 3 గంటల 45 నిమిషాల తర్వాత నమోదు చేయడం ఏమిటి అని మండిపడ్డారు.
రాత్రి 11:45 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదైందా? ఆసుపత్రిలో ఎవరూ ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ప్రిన్సిపాల్ , వైస్ ప్రిన్సిపాల్ ఏమి చేస్తున్నారు? అధికారులు ఏం చేశారు?
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఆసుపత్రిలోని అధికారుల బాధ్యత. తండ్రి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? అని నిలదీశారు సీజేఐ.