నిప్పులు చెరిగిన సర్వోన్నత న్యాయస్థానం
ఢిల్లీ – బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకర్ కు రాజ్యాంగం విశేష అధికారాలు కల్పించిందని, కోర్టులు హరించ లేవన్నారు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాతే జ్యూడిషియల్ సమీక్షకు ఛాన్స్ ఉంటుందన్నారు. కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదన్నారు.
కాగా స్పీకర్ కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. దీనిపై జస్టిస్ గవాయ్ సీరియస్ గా స్పందించారు. ఈ సమయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించలేమా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఒక రకంగా నిలదీసినంత పని చేశారు. కోర్టులు రాజ్యంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని తెలియదా అని ఉగ్ర రూపం దాల్చారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని నిలదీశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అన్నారు. ప్రజలు ఎన్నుకున్నది మౌనంగా ఉండటానికేనా అని అన్నారు.