ప్రశ్నిస్తే కేసులు పెడతారా – సుప్రీంకోర్టు
చెల్లుబాటు కాదని యోగి సర్కార్ కు చీవాట్లు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నించడం, నిలదీయడం ప్రజాస్వామ్యం బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాగని తమను ప్రశ్నించ కూడదంటే ఎలా..? ఇది కుదరదు. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. ఆ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా కేసు నమోదు చేస్తారంటూ సీరియస్ అయ్యింది.
సమాజంలో సవాలక్ష సమస్యలు కొలువు తీరి ఉంటాయి. వాటిని ప్రజల తరపున ప్రస్తావించడం, వెలుగులోకి తీసుకు రావడం షరా మూమాలే. అది వృత్తి ధర్మంగా జర్నలిస్టుల బాధ్యత. కవులు, కళాకారులు, రచయితలు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అలా అని తమను ప్రశ్నించ కూడదంటే ఎలా..ఇది తగదు అని సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. “కేవలం జర్నలిస్టు రచనలు ప్రభుత్వంపై విమర్శలుగా భావించ బడుతున్నందున, రచయితపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆ విధంగా పేర్కొంది. రాష్ట్ర పరిపాలనలో కుల గతిశీలతపై ప్రత్యేక కథనం రాశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది యోగి ఆదిత్యానాథ్ సర్కార్. సదరు జర్నలిస్ట్ పై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిర కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.