డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
సుమోటోగా స్వీకరించిన న్యాయ స్థానం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో చోటు చేసుకున్న డాక్టర్ హత్యాచారం ఘటన. ఎమర్జన్సీ వైద్య సేవలు నిలిచి పోయాయి. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరో వైపు పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టింది బెంగాల్ ప్రభుత్వం . ఇదే సమయంలో సీఎం మమతా బెనర్జీ పూర్తి విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు.
బాధితురాలికి మద్దతుగా సీఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా చేపట్టారు. బాధిత కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అయినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరో వైపు ఎస్పీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సీరియస్ కామెంట్స్ చేశారు. డాక్టర్ హత్యాచారం ఘటన తనను కూడా బాధ పెట్టిందని, అయితే దోషులు ఎంతటి వారైనా శిక్ష పడక తప్పదన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కావాలని రాద్దాంతం చేస్తోందంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.