5 రాష్ట్రాల సీఎస్ లపై సుప్రీంకోర్టు సీరియస్
ఏం తమాషాగా ఉందా అని తీవ్ర ఆగ్రహం
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిదు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏం తమాషాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాబ్ లించింగ్‌కు వ్యతిరేకంగా పిఐఎల్‌లో కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయనందుకు 5 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ముఖ్యంగా ‘ఆవు సంరక్షకుల’ ద్వారా హత్యలు , మూక హింస కేసులు పెరుగుతున్నాయని ఆరోపించిన ఆరోపణలపై అప్రమత్తం చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో.
ఈ సందర్బంగా ఈ కేసుకు సంబంధించి ధర్మాసనం విచారించింది. దేశంలోని అస్సాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై ఫైర్ అయ్యింది. తదుపరి తేదీలోగా తమ కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఆదేశించింది.
లేని పక్షంలో ప్రధాన కార్యదర్శులు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని, ఎందుకు చర్య తీసుకోకూడదో కారణం చూపాలని జస్టిస్‌లు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.