లడ్డూ వివాదం సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించిన కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. నెయ్యిపై రుజువు లేకుండా ఎందుకు ప్రెస్కు వెళ్లాలని ఆంధ్రా సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది
లడ్డూకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు . ప్రధానంగా రాజ్యంగబద్దమైన పదవుల్లో ఉన్న వారు ఎలాంటి విచారణకు ఆదేశించకుండా ఇలా బహిరంగంగా మాట్లాడతారా అంటూ సీరియస్ అయ్యింది కోర్టు.
మీరే తిరుపతి లడ్డు కల్తీ అయ్యిందంటూ విచారణకు ఆదేశించినప్పుడు మీడియాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీసింది.రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయాల నుండి మతాన్ని వేరుగా ఉంచాలని భావిస్తున్నారని, కేసు దాఖలు చేయడానికి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి ముందే ముఖ్యమంత్రి నాయుడు ఈ విషయం గురించి మాట్లాడారని పేర్కొంది.
‘‘భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేలా ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సింది కాదా?… విచారణకు ఆదేశించినప్పుడు రాజ్యాంగబద్ధమైన ఉన్నతాధికారి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం సరికాదని తాము ప్రాథమికంగా భావిస్తున్నాం’’ అనివిచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.