గిరిజన పిల్లల కోసం సూర్య భారీ విరాళం
సీఎం స్టాలిన్ కు రూ. 1 కోటి చెక్కు వితరణ
తమిళనాడు – తమ స్టూడియోలకు భూమి కావాలి..బ్లాకులో టికెట్లు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వండి. మా బూతు సినిమాలకు పన్ను రాయితీ వచ్చేలా చూడాలి అంటూ అడిగే నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉన్న ఈ కాలంలో తమిళ సినీ రంగానికి చెందిన నటీనటులు సూర్య, జ్యోతిక దంపతులు మాత్రం అందుకు భిన్నంగా తమ గొప్ప మనసును చాటుకున్నారు.
రిటైర్డ్ జడ్జి జస్టిస్ చందు జీవిత కథను ఆధారంగా చేసుకుని తీసిన జై భీం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు ప్రశ్నలను లేవనెత్తింది. భారీ ఆదాయం కూడా సమకూరింది. ఈ సందర్బంగా సినిమా పరంగా వచ్చిన ఆదాయంలోంచి గిరిజన సంక్షేమ శాఖ (సంఘం)కు , అడవి బిడ్డల చదువు కోసం తమ వంతు బాధ్యతగా రూ. 1 కోటి విరాళాన్ని అందజేశారు సూర్య, జ్యోతికలు.
తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం ఎంకే స్టాలిన్ ను కలిసి వారు విరాళానికి సంబంధించిన చెక్కును ఇచ్చారు. ఈ సందర్బంగా తమ ఉదారతను చాటుకున్న నటీ నటులు సూర్య, జ్యోతికలను ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి. ఈ వితరణ ఎంతో మంది పిల్లలకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా విద్యాభివృద్ది కోసం ఎంతో ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.