DEVOTIONAL

సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి

Share it with your family & friends

గోవర్ధన గిరిధారి రూపంలో

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం అమ్మ వారు శ్రీ గోవర్ధన గిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మ వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. భక్తులు అడుగడుగునా నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని దర్శించుకున్నారు.

సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి.

అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మ వారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మ వారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వ వాహనంపై అమ్మ వారు విహరించనున్నారు.

వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఈవో జె. శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.