మానని గాయం మేక బతుకు సంచారం
బెన్యామిన్ ప్రయత్నం స్వర్ణ కిలారి అనువాదం
మానవ జీవితమే సంచారం. దానికి ప్రారంభమే తప్పా అంతం లేదు. ఉండదు కూడా..ఆశ పడటం కూడా నేరమే..కలలు కనడం కూడా తప్పే..గాయాలు లేకుండా మనం మనలేం. ఎందుకంటే గాయం చేయక పోతే అది బతకడం ఎలా అవుతుంది..? కన్నీళ్లను తాకని మనిషి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడంటే నమ్మగలమా. పుట్టడం..పరుగులు తీయడం..జ్ఞాపకాలను పొదిళ్లలో పట్టుకునేందుకు పోరాటం చేయడం నిత్యం జరిగే తంతు. ఆది నుంచి నేటి దాకా నిత్యం యుద్దమే. ఇది అనివార్యంగా మారి పోయింది. మార్కెట్ మాయజాలం ప్రపంచాన్ని కమ్మేయడం ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో..జీవించడం అత్యంత నికృష్టంగా మారి పోయింది. దీనిని ఎవరూ కాదనలేని సత్యం. మనుషుల మధ్య బంధాలు..బాంధవ్యాలు మృగ్యమై పోతున్న వేళ సంచారం మరింత సంక్లిష్టంగా మారింది. ఇది కాదనలేని సత్యం..వ్యవస్థలన్నీ డొల్లతనం ముసుగు వేసుకుని..రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నం చేయడం వల్ల ఆశలు..కలలన్నీ బోసి పోతున్నాయి. వాటి వెంట పరుగులు తీయాలని అనుకునే వాళ్లందరి బతుకులు తెల్లారే సరికి భళ్లున తెల్లారి పోతున్నాయి. కళ్ల ముందే రాలి పోతున్నాయి.
వీటన్నింటి వెనకాల అంతు చిక్కని సమస్యలు ఎన్నో..కష్టాలు మరెన్నో..శరీరాలు కాస్తంత సేద దీరేందుకు అలవాటు పడేందుకు తహ తహ లాడే వేళ..ప్రతిదీ నరకంగా మారడం ఎంత విచిత్రం కదూ. ఆశించడం మొదలైతే ఆనందం దక్కుతుందని అనుకుంటాం. కానీ అది మనల్ని మరింతగా దిగజార్చేలా చేస్తుందని అనుకోం. అదే మానవ నైజం..ఇది కొనసాగుతూ వస్తున్న చరిత్రకు దర్పణం. ఏ చరిత్రను చూసినా ఏమున్నది వలస బతుకులే కదా. కట్టుకున్న వాళ్లను..కన్న వాళ్లను..కావాలని అనుకున్న వాళ్లను..ప్రేమించిన వాళ్లను..మన కోసం త్యాగం చేసిన వాళ్లను కాదనుకుని కాసిన్ని కాసుల కోసం కనిపించని..సూదర తీరాలలోకి వెళ్లడం కొన్ని తరాల నుంచి జరుగుతూ వస్తున్నదే. దీన్ని బానిసత్వం అని అంటారా లేక బతక లేని తనంగా భావిస్తారా అన్నది పక్కన పెడితే ..వలస అన్నది బతుకు ప్రయాణంలో భాగంగా మారి పోయింది. ఉన్నదాంట్లో సంతృప్తి చెందక పోవడం..లేని దాని కోసం వెంపర్లాడటం అత్యాస అవుతుందేమో కానీ..ప్రయాణం చేయక పోతే ఎలా..ఆ అలుపెరుగని జర్నీనే మనుషులను కలిపేలా చేసింది..కట్టు తప్పకుండా ఉంచేలా చేసింది..
ఇది నిత్యం జరుగుతున్నదే..కానీ వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు సంఘటనలు..పరిస్థితుల కారణంగా అర్థాలు మారి పోతుంటాయి. వలసలు కొందరి కాసులను కురిపిస్తే మరికొందరికి చావును తెప్పిస్తాయి..ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. కదిలిస్తే కన్నీళ్లయినా వస్తాయి..లేదా కాసిన్ని గాయాల జ్ఞాపకాలైనా మనల్ని తడుముతూనే ఉంటాయి. తన స్థలం విడిచిన మనిషి ఎక్కడికి వెళ్లినా..ఎంత సంపాదించినా పరాయి వాడే..తనతనం కోల్పోయిన వారిగానే మిగిలి పోతారు..ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో..ఎడారులు..చెట్లు..జంతువులు..పూలు..పక్షలు..ఇవన్నీ ఒక ఎత్తు..వలస జీవులలో కొందరే అదృష్టవంతులు..మిగతా వారంతా ఆనవాళ్లు లేని జ్ఞాపకాలు..వలసలు అనే సరికల్లా ముందుగా గుర్తుకు వచ్చేది కేరళ..తెలంగాణ ప్రాంతాలు..అరబ్ దేశాలకు పోయిన వారే ఎక్కువ..ఇక్కడికి వచ్చిన వారు చాలా తక్కువ. ఇలాంటి వలస పక్షుల వెతలు ఎన్నో..కదిలిస్తే కళ్లలో నీళ్లు మిగలవు..గుండెల్ని చిదిమేసే గాయాలు తప్పా..ఇలాంటి వలస జీవి అనుభవించిన నిజమైన కన్నీ కథ..అంతులేని వ్యధకు ప్రతిరూపమే బెన్యామిన్ చేతిలో రూపు దిద్దుకున్న నజీమ్.
మేక బతుకు..ఇది కథ కాదు..నవల అంతకన్నా కాదు..ఇదో సంచార బతుకు చిత్రం. హృదయ విదారకమైన కర్కశపు ఆనవాళ్లను ప్రపంచానికి తెలియ చేసిన ప్రయత్నం. బతకడం అంటే మరణం కోసం చేసే ప్రయాణం మాత్రమే..నజీబ్ అనుభవించిన ప్రతి సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన తీరు..దానిని మనలోకి తీసుకు పోయేలా చేసిన స్వర్ణ కిలారీ అనువాదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. గాయ పరుస్తూనే ఉంటుంది..నిద్ర పోకుండా..కన్నీళ్లు కార్చేలా..చేస్తూనే ఉంటుంది..అవును నజీవ్ మనిషి రూపంలో ఉన్న ప్రవక్త. బతుకును జయించిన విజేత..కోట్లాది మంది వలస పక్షులకు అతడు భరోసా..నజీబే కాదు..ప్రతి మేక..గొర్రెల మంద కూడా మానవ సమూహానికి పాఠాలుగా మిగిలి పోతాయి. ఈ అంతు చిక్కని ప్రయాణంలో తను సాగించిన ప్రస్థానం అత్యంత సాహసోపేతమైనది..
అంతకు మించి ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు మనల్ని ఒక పట్టాన ఉండనీయవు. అందుకే కదూ..కాసింత జాగా కోసమే ఇన్ని సమస్యలు..ఇన్ని పోరాటాలు..ఇన్ని ద్వేషాలు..దారుణాలు..ఉన్న చోట బతకడం గగనంగా మారితే వలస తప్పని ప్రయాణం. ఇది మేక బతుకు మాత్రమే కాదు..మనందరి బతుకు…దీనిని చదవక పోతే మనం ఓ జీవిత కాలాన్ని కోల్పోయినట్టే..!