ఘనంగా స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు
తిరుపతి – శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు.
ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పి.వరలక్ష్మి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ ఈవో దామోదరం, ఏఈవో ఎం. గోపినాథ్, సూపరింటెండెంట్ వి.రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు డి.మునికుమార్, ఎం ధోనీ శేఖర్ , ఇతర ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.