స్వరూపానందేంద్ర భద్రత కుదింపు
ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా గత ప్రభుత్వానికి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చిన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి బిగ్ షాక్ తగిలింది.
ఆయనకు గత సర్కార్ ఏర్పాటు చేసిన భద్రతను కుదించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది.
పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్‌మెన్, ఎస్కార్ట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు.
స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్ వాహనం ద్వారా ట్రాఫిక్ నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశ ద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లు కలిపి 15 మంది ఉండే వారు. ప్రస్తుతం స్వరూపానందేంద్రకు కేవలం ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది.