అసత్య ప్రచారం మలివాల్ ఆగ్రహం
ఆప్ మంత్రులపై కోర్టుకు వెళతా
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు , ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను ఎవరి ట్రాప్ లో ఇరుక్కోలేదని స్పష్టం చేశారు.
మంగళవారం స్వాతి మలివాల్ మీడియాతో మాట్లాడారు. ఆప్ నేతలపై , మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే తాను నటిస్తున్నానంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు స్వాతి మలివాల్.
ఆప్ పార్టీకి చెందిన నాయకులు పార్టీ సభ్యులందరికీ ఫోన్లు చేస్తున్నారని , తన వ్యక్తిగత వీడియోలు ఏమైనా ఉన్నాయా అంటూ అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీకు చేతనైతే బయటకు వచ్చి ధైర్యంగా అడగాలని సవాల్ విసిరారు స్వాతి మలివాల్.
ఇదిలా ఉండగా తన పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశాడని ఆరోపించారు. దీంతో ఆమె చేసిన ఆరోపణలపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో సిట్ ను ఏర్పాటు చేశారు. తనపై లేనిపోని విమర్శలు చేసే వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకు వెళతానంటూ ప్రకటించింది.