కేసీఆర్ బర్త్ డే కోసం ఏర్పాట్లు
ప్రకటించిన మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఈనెల 17న జరగనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.
రేపటితో కేసీఆర్ కు 70 ఏళ్లు పూర్తవుతాయని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు తలసాని. కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పలు ఆలయాలు, మసీదులు, చర్చీలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అంతే కాకుండా 1,000 మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల కవరేజీ వచ్చే విధంగా మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య భీమా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా వికలాంగులకు వీల్ చైర్స్, ఆస్పత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ సాధకుడిగా ఘనమైన చరిత్ర కలిగిన కేసీఆర్ గురించి 30 నిమిషాల వ్యవధితో కూడిన తానే ఒక చరిత్ర పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీనీ ప్రదర్శించడం జరుగుతుందన్నారు.