DEVOTIONAL

టీటీడీ స్పెష‌ల్ ఎంట్రీ టికెట్ల‌ను ఇవ్వండి

Share it with your family & friends

మంత్రిని కోరిన త‌మిళ‌నాడు మంత్రి రాజేంద్ర‌న్

అమ‌రావ‌తి – త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి రాజేంద్ర‌న్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా తమిళనాడు టూరిజం కార్పొరేషన్‍కు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్పెషల్ ఎంట్రీ టికెట్లను కేటాయించాలని కోరారు. ఈ మేర‌కు మంత్రికి లేఖను అందజేసారు. తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్రదర్శన టికెట్లను పునరుద్ధరించాలని సూచించారు.

చెన్నై నుంచి నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి రాజేంద్రన్‌కు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండి ఫరూక్‌ ఘనస్వాగతం పలికారు. వేద పండితుల వేద ఆశీర్వాచనాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా 1974వ సంవత్సరం నుంచి తమిళనాడు టూరిజం డెవలప్‌మెంటు కార్పొరేషన్‌కు టిటిడి దర్శన టిక్కెట్లను కేటాయిస్తుందని, దీంతో తమిళనాడులోని భక్తులు చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం టీటీడీ కల్పించిన అవకాశాన్ని భక్తుల సేవ కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి రాజేంద్రన్‌ మంత్రి ఆనంకు వివరించారు. అయితే ఇటీవల అన్ని టూరిజం కార్పొరేషన్లకు ఈ శీఘ్ర దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు రద్దు చేసిందని, దీనిని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి ఆనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఆర్డీవో అనూష తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *