మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వెంటనే తమిళనాడుకు బయలుదేరి వెళ్లారు తమిళి సై సౌందర రాజన్ . ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన జీవిత కాలంలో మరిచి పోలేని జ్ఞాపకం తెలంగాణ ప్రాంతానికి గవర్నర్ గా పని చేయడం అని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా తనను ఆదరించి, అక్కున చేర్చుకున్న రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాని చెప్పారు తమిళిసై సౌందర రాజన్. మీ అందరినీ వదిలేసి వెళ్లి పోతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . తెలంగాణ ప్రజలందరూ తన సోదరులు, అక్కా చెల్లెళ్‌లు అని తాను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పారు మాజీ గవర్నర్.
గవర్నర్ గా ప్రజల కోసం , వారి సంక్షేమం కోసం తనవంతుగా కృషి చేశానని, వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని అయినా అవి జీవితంలో మామూలేనని పేర్కొన్నారు తమిళి సై సౌందర రాజన్.