ఏ ప్రాతిపదికన కూల్చుతున్నారు..?
దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్ – సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన భవనాలను కూల్చుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు.
ఏ చట్టాలను పరిగణలోకి తీసుకుని వీటిని కూల్చుతున్నారనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ సరే మరి నాలా ఆక్రమణలు కూల్చాలి కదా అని అన్నారు.
వాటిని కూల్చాలంటే వేలాది ఇళ్లను కూల్చాల్సి వస్తుందని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలా కూల్చుకుంటూ పోతే సగం హైదరాబాద్ ను కూల్చాల్సి వస్తుందని చెప్పారు. స్లమ్స్ అన్నీ ఆక్రమించుకుని నిర్మించారని మరి ఇప్పుడు వాటిని హైడ్రా కూల్చి వేస్తుందా అని నిలదీశారు దర్శకుడు.
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో హల్ చల్ చేయడం మానుకోవాలని సూచించారు. కూల్చే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పనిగట్టుకుని కొందరిని టార్గెట్ చేస్తూ కూల్చడం వల్ల బద్నాం అయ్యే ప్రమాదం ఉందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.