భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన బీసీసీఐ
కోల్ కతా – టాటా ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ , ఐపీఎల్ గవర్నింగ్ బాడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించనుంది. తాజా, మాజీ క్రికెటర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భారతీయ సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటీ నటులు కూడా హాజరవుతారు. ప్రముఖ గాయనీ గాయకులు తమ పాటలతో అలరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ అజింక్యా రహానే నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ ఆడనుంది. రెండు నెలల పాటు ఈ టోర్నీ జరగనుంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్, చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ఆడతాయి. ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ షెడ్యూల్ ఖరారు చేసింది. వేల కోట్ల వ్యాపారం ఈ టోర్నీ ద్వారా జరగనుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.