తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం
పార్టీ ఏర్పాటై 42 సంవత్సరాలు
అమరావతి – దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటై నేటితో 42 ఏళ్లవుతోంది. భారత దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ఘనత దివంగత సీఎం ఎన్టీఆర్ కే దక్కుతుంది. పేరుకు మూడు అక్షరాలైనా సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాతుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది.
కేవలం కొందరికే పరిమితమైన రాజకీయాలు ఉన్నట్టుండి ప్రధానంగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తెలుగుదేశం ప్రజల సంక్షేమమే ప్రధానమని స్పష్టం చేసింది. కానీ రాను రాను అది కూడా కుటంబ పార్టీగా మారి పోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంది.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా… 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
\రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని… ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని కొనియాడారు. ఇక ముందు కూడా ఇదే అంకిత భావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు టీడీపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు టీడీపీ బాస్.