కూటమి పంథం గెలుపే లక్ష్యం
టీడీపీ..జనసేన..భారతీయ జనతా పార్టీ
విజయవాడ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు ఆక్టోపస్ లా విస్తరించిన వైసీపీ పార్టీ మరో వైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన కమిటీతో పాటు వైఎస్ షర్మిలా రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ బరిలోకి దిగాయి. మాటల తూటాలు పేల్చుతున్నాయి.
ఇక గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఇదే మన అంతిమ లక్ష్యం కావాలని టీడీపీ కూటమి స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు విజయవాడలో కీలక భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , తెలుగుదేశం పార్టీ ఏపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
వీరితో పాటు బీజెపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్, శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ హాజరయ్యారు. ఎలాగైనా సరే అన్ని పార్టీలకు చెందిన సీనియర్లు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ 45 రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.