నిప్పులు చెరిగిన టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావు
అమరావతి – టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. టీటీడీని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మనుగడ కోల్పోతున్న పార్టీని బతికించు కోవడానికి నిత్యం ఏదో ఒక బూటకపు మాటలతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. చని పోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదన్నారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. 100 ఆవులు చని పోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
తిరుమలలో గోవులను దేవతల రూపంగా భావించి, పరమ పవిత్రతతో పూజించి పరిరక్షిస్తున్నామని చెప్పారు శ్రీనివాస రావు. గోశాలలో వందలాది గోవులకు మంచి ఆహారం, వైద్యం, సంరక్షణ అందించబడుతోందని అన్నారు. గోవుల మరణాలు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఇప్పటివరకు గోశాలలో ఏ ఒక్క గోమాత మరణించ లేదన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో, వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయి. ఇవి గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందని అన్నారు.
అబద్దాల మీద రాజకీయ మనుగడ సాగిస్తున్న వైసీపీ పార్టీ ఇలాంటి నీచపు ప్రచారాలతో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల పర్యాటకులకు, భక్తులకు గోశాలలో జరిగే సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలని టీటీడీ యోచిస్తోందని అన్నారు.. ప్రతిష్టితమైన తిరుమల పుణ్యక్షేత్రం గౌరవాన్ని కాపాడడం ప్రతి భక్తుని బాధ్యత, దయచేసి రూమర్లకు దూరంగా ఉండాలని సూచించారు.