టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కామెంట్స్
అమరావతి – వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. తను అప్రూవర్ గా మారడం ఖాయమని జోష్యం చెప్పారు. అంతే కాకుండా మాజీ సీఎం జగన్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తను డిస్ క్వాలిఫై అవ్వడం పక్కా అన్నారు. పులివెందుల శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాలపై కూటమి సర్కార్ విచారణ చేపడుతుందన్నారు.
బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డికి జగన్ రెడ్డికి మధ్య అగాధం పెరిగిందన్నారు. అందుకే తనను పట్టించుకోక పోవడంతో చివరకు గత్యంతరం లేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడని ఎద్దేవా చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైఎస్సార్సీపీ తుడుచుకు పెట్టుకు పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ రెడ్డి ఎన్ని ప్రగల్భాలు పలికినా చివరకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. కూటమి సర్కార్ ప్రస్తుతం ప్రజా రంజక పాలన సాగిస్తోందన్నారు.