ఈసీకి టీడీపీ కూటమి ఫిర్యాదు
1వ తేదీన పెన్షన్లు అందించాలి
అమరావతి – తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో సీనియర్ల బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదు చేసింది. సామాజిక పెన్షన్లను వచ్చే నెల మే 1వ తేదీ నుంచి లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చెందిన నాయకులు వర్ల రామయ్య, టి. శివ శంకర్ , ఆర్ డీ విల్సన్.
ఈ మేరకు వెంటనే పెన్షన్లు అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తక్షణమే ఉత్తర్వులు ఇస్తే లబ్దిదారులు ఆందోళన చెందకుండా ఉంటారని పేర్కొన్నారు. కావాలని సర్కార్ నాన్చుతోందని ఆరోపించారు. దీని వల్ల పూట గడవడం ఇబ్బందికరంగా మారుతుందన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన రూల్స్ ను అతిక్రమిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధానంగా సీఎం జగన్ రెడ్డి , ఆయన పరివారంపై ఫోకస్ పెట్టాలని సూచించారు వర్ల రామయ్య. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఈవో కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు.