తాడేపల్లి సభకు సమన్వయ కమిటీ
ఏర్పాటు చేసిన టీడీపీ..జనసేన పార్టీలు
అమరావతి – ఏపీ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఏపీలోని శాసన సభతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఆయా పార్టీలన్నీ కదన రంగంలోకి దూకాయి. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ మేరకు కూటమిగా ముందుకు వెళ్లనున్నాయి.
శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తొలి విడతకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 28న టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
సభను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేపట్టేందుకు ప్లాన్ చేశాయి ఇరు పార్టీలు. ఇందుకు గాను ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామా నాయుడు, ఎంవీ సత్యనారాయణ రాజు ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి కొటికల పూడి గోవింద రావు, కందుల దుర్గేష్ , బొలిశెట్టి శ్రీనివాస్ , పత్సమట్ల ధర్మ రాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్ప ఉన్నారు.