NEWSANDHRA PRADESH

ఏపీలో నామినేటెడ్ పోస్టుల‌పై ఫోక‌స్

Share it with your family & friends

25,000 మందికి పైగా ద‌ర‌ఖాస్తులు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కూట‌మి ప్ర‌భుత్వానికి నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ తో పాటు బోర్డు మెంబ‌ర్ల ఎంపిక సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌త్యేకించి తెలుగుదేశం పార్టీతో పాటు జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీకి ఏకంగా నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి గ‌తంలో 3 వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు రాగా ఈసారి ఆ సంఖ్య పెర‌గ‌డం విస్తు పోయేలా చేసింది. 25,000ల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు రావ‌డంతో పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విస్తు పోయారు.

ఇదే స‌మ‌యంలో టీటీడీకి సంబంధించి ఎక్కువ‌గా అప్లికేష‌న్స్ వ‌చ్చాయి. మాజీ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజుతో పాటు టీవీ5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు రేసులో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రో వైపు 25కి పైగా కార్పొరేష‌న్స్ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్ల పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులు రావ‌డం ప‌ట్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ తెలుగుదేశం పార్టీ కీల‌క‌మైన పోలిట్ బ్యూరో స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపైనే ఎక్కువ‌గా చ‌ర్చించ‌నున్నారు.