టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న
అమారవతి – టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. నీ వెకిలి చేష్టల కారణంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారానికి దూరమైందని అన్నారు. తమ నాయకుడు , సీఎం చంద్రబాబుపై వెకిలిగా మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసనలు చేపట్టారని, ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. మీకు తెలంగాణలో దిక్కు లేదని, ఇక ఏపీ గురించి ఎందుకు వాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు బుద్దా వెంకన్న.
మంగళవారం టీడీపీ సీనియర్ నేత మీడియాతో మాట్లాడారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లిన ఘనత తమ అధినేత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన బాబు గురించి కేటీఆర్ అవాకులు చెవాకులు పేలడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరుతో మీరు చేసిన దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇది ఎవరిని అడిగినా చెబుతారని స్పష్టం చేశారు. మీ ప్రాంతం పట్ల మీరు దృష్టి సారిస్తే మంచిదని లేక పోతే బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఇంకోసారి కేటీఆర్ నోరు పారేసుకోవడం ఆపాలని సూచించారు బుద్దా వెంకన్న.