తీగల చూపు తెలుగుదేశం వైపు
సీఎంను కలిసిన మల్లారెడ్డి..మర్రి
హైదరాబాద్ – రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో గతంలో పని చేసిన వారంతా మరోసారి తమ చూపు ఆ పార్టీ వైపు సారిస్తున్నారు.
ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు తీగల కృష్ణా రెడ్డి సోమవారం ఏపీ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.
ఇదే సమయంలో తమ కూతురి వివాహానికి రావాల్సిందిగా సీఎం కుటుంబాన్ని ఆహ్వానించారు. నారా వారిని కలుసుకున్న తర్వాత తీగల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము మర్యాద పూర్వకంగానే కలుసుకున్నామని అన్నారు.
మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిల విషయమేమో కానీ తాను మాత్రం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు తీగల కృష్ణా రెడ్డి. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత, సైబరాబాద్ ను రూపొందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదేనంటూ కితాబు ఇచ్చారు .