ముగిసిన సీఎంల ముచ్చట
కమిటీల ఏర్పాటుతో క్లోజ్
హైదరాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిల ముచ్చట ముగిసింది. అహో అంటూ ఊదరగొట్టారు. ఏపీకి చెందిన ఆంధ్రా మీడియా ఇదేదో గొప్ప విషయమైనట్లు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకు ఆయన శిష్యుడికి ప్రచారం కల్పించింది. తీరా చర్చలతోనే ఇద్దరూ ముగించారు. ఒకరినొకరు సీఎంల హోదాలో పలకరించుకున్నారు. బొకేలు ఇచ్చుకున్నారు.
ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశమూ కొలిక్కి రాలేదు. సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సందర్బంగా సమావేశం అనంతరం చర్చలు జరిగిన తీరు గురించి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు.
ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామన్నారు.. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను త్వరగా పరిష్కరించు కోవాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంతోనే పరిష్కారాలన్నీ దొరుకుతాయని భావించడంలేదన్నారు.
సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుందన్నారు.