జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
హైదరాబాద్ – బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు జారీ ఏచశారు. ఎందుకు ఫిరాయించారనే దానిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. కాగా నోటీసులపై స్పందించారు ఎమ్మెల్యేలు. తమకు కొంత సమయం కావాలని కోరారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వీరు భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున బీ ఫామ్ తీసుకుని గెలుపొందారు. ఊహించని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఉన్నట్టుండి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. హస్తం గూటికి చేరారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే జంప్ జిలానీలుగా మారారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్.
వీరు తమ పార్టీపై పోటీ చేసి ఎలా ఇతర పార్టీలోకి వెళతారంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సరైన సమాధానం రాక పోవడంతో కేటీఆర్ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కార్యదర్శి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిద్ర పోతున్నారా అంటూ మండిపడింది. వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దెబ్బకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.