16న ఆటోలు బంద్
తెలంగాణ సర్కార్ పై గుస్సా
హైదరాబాద్ – తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు . ఇప్పటికే అంతంత మాత్రంగా బతుకుతున్న తమపై ప్రభుత్వం కక్ష కట్టిందని వాపోతున్నారు.
ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో భారీ ఎత్తున మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులు ప్రయాణం చేస్తున్నారు. ఉన్న బస్సులు సరి పోవడం లేదు. వివిధ పనుల నిమిత్తం ప్రయాణం చేయాలంటే నరకం అనుభవించాల్సి వస్తోంది.
దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని, ఈ ఫ్రీ బస్సు సర్వీస్ కారణంగా తమకు ఉపాధి కరువైందని, పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం విస్తు పోయేలా చేసింది.
తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16న ఆటోలు బంద్ చేస్తున్నట్లు ఆటో డ్రైవర్లు ప్రకటించారు.