మార్చి 27 వరకు కొనసాగనున్న సమావేశాలు
హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ జరగనుంది. నిన్న గవర్నర్ ప్రసంగం పూర్తయింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రగతి గురించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పూర్తిగా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లాగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. రెండో రోజు తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మార్చి 19న 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం జరగనుంది. ఈనెల 27 వరకు వివిధ పద్దులపై చర్చ కొనసాగుతుంది. అదే రోజు సభ వాయిదా పడే అవకాశం ఉంది. 14న హోలి పండుగ ఉండడంతో అసెంబ్లీకి సెలవు ఉంటుందని ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 20న బడ్జెట్ అధ్యయనం కోసం శాసన సభకు సెలవు ప్రకటించామన్నారు. 12 రోజుల పాటు శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.