NEWSTELANGANA

విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌ముఖుల పేర్లు ఖ‌రారు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణలోని మూడు ప్రధాన విద్యా సంస్థలకు ప్రముఖుల పేర్లను ఖరారు చేసింది. హైదరాబాద్ కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సాంఘిక, సాహిత్యోద్యమ నేత సురవరం ప్రతాపరెడ్డి పేరును, కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్వాతంత్ర‌ సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును మంత్రిమండలి నిర్ణయించింది.

హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది.

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంద‌ని పేర్కొంది.

కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం. హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించు కునేందుకు అనుమతి ఇచ్చింది.

ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు.

ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీఎఫ్‌కు కూడా వర్తింప జేస్తున్న‌ట్లు మంత్రిమండ‌లి ప్ర‌క‌టించింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయిస్తూ తీర్మానం చేసింది.

ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయిస్తూ తీర్మానం చేసింది మంత్రివ‌ర్గం. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు చేస్తూ తీర్మానం చేసింది.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చడం. కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు చేస్తూ తీర్మానం చేసింది రాష్ట్ర మంత్రివ‌ర్గం.