అందెశ్రీ గీతానికి సర్కార్ ఆమోదం
ఇక జయ జయహే తెలంగాణ గీతాలాపన
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కవి , రచయిత, గాయకుడు అందెశ్రీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ ఉద్యమ గీతానికి తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోద ముద్ర వేసింది. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్బంగా ఈ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యోతన జరిగిన కీలక కేబినెట్ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఉద్యమ గీతం కోట్లాది మందిని కదిలించింది. కానీ ఈ గీతానికి స్వర కల్పన కీరవాణి చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గీతానికి సంబంధించి 2.30 నిమిషాలతో పాటు మరోటి 13.30 నిమిషాల నిడివి కలిగిన గీతాలకు స్వరాలు కూర్చారు .
ప్రభుత్వ కార్యక్రమాలలో జయ జయహే తెలంగాణ గీతాన్ని సులువుగా ఆలాపించేందుకు తక్కువ నిడివితో పాటకు స్వర కల్పన చేసినట్లు పేర్కొన్నారు ఎంఎం కీరవాణి. ఈ రెండు కూడా రాష్ట్ర సర్కార్ ఆమోదం పొందాయన్నారు సీఎం . ఇదే సమయంలో రాష్ట్ర అధికారిక చిహ్నంతో పాటు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా నిర్ణయించారు.