మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
జీవోలు 317.. 46పై సమీక్షా సమావేశం
హైదరాబాద్ – ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన , మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారుల పీఆర్సీ చైర్మన్ శివ శంకర్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, సెక్రటేరియట్ సర్వీసెస్ కార్యదర్శి నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ దేవ సేన, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి, కోదండరామ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఆ జీవో లకు సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన ఆ జీవోలను రద్దు చేయాలని మంత్రి వర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగుల స్థానికత ఆధారంగా, జోన్ల వారీగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విన్నవించాయి. మంత్రులు సుదీర్ఘంగా ఆయా ఉద్యోగ సంఘాలు సమర్పించిన విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు కమిటీ పరిశీలించి, అధ్యయనం చేసి తగు నివేదికలను సిద్దం చేసి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు. సానుకూల పరిష్కారానికి, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీజీఓ, టీఎన్జీవో, టీఆర్ఈఎస్ఏ, పీఆర్టీయూ, ఎస్టీఎఫ్, ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.