ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు – సీఎం
సంచలన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రహదారులపై యాచన చేసుకునే ట్రాన్స్ జెండర్లకు తీపి కబురు చెప్పారు. వారికి సమాజంలో సమున్నతమైన గౌరవం కల్పించేందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్రాన్స్ జెండర్లను ప్రత్యేక వాలంటీర్లుగా (ప్రభుత్వ పరిధిలో) నియమించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమించేందుకు విధి విధానాలను ఖరారు చేయాలని, హోం గార్డుల మాదిరిగానే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్, వేతనాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సహాయం చేస్తామని ఎన్నికల సందర్బంగా ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేయడం విశేషం. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు ట్రాఫిక్ నిర్వహణలో, హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవ్ తనిఖీల సమయంలో కూడా సహాయం చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.