కేసీఆర్ పేరు లేకుండా చేస్తా – సీఎం
సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇక నుంచి కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని ప్రకటించారు. ఆయన పేరును చెరిపి వేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
తెలంగాణ పేరు చెప్పి అందినంత మేర దోచుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపణలు చేశారు. ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాచరిక పాలన సాగించాడని, ఒక రకంగా ఆనాటి దొరల పాలనను మరోసారి గుర్తుకు తెచ్చేలా చేశారని మండిపడ్డారు.
ఒక సంవత్సరం తర్వాత కేసీఆర్ అనే పేరు ఎక్కడా కనిపించదని, వినిపించదని అన్నారు. ఏడాది వరకు మాత్రమే కేసీఆర్ పేరు వినిపిస్తుందని, ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం ముగిసి పోతుందని జోష్యం చెప్పారు.
హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను , కూడబెట్టిన కోట్లను చూసి మురిసి పోతున్నారని, వారి పని ఖతం చేస్తానని హెచ్చరించారు. మొత్తంగా కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.