రాష్ట్రపతి రాకపై సీఎస్ సమీక్ష
విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
హైదరాబాద్ – భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 16న హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్బంగా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. కీలక సూచనలు చేశారు.
రాష్ట్రానికి ప్రముఖుల రాక నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, తగిన రీతిలో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన శాంతి భద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు.
విమానాశ్రయం, రాజ్ భవన్, అన్ని ఇతర వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు సీఎస్.
భారత రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే మార్గాలతో పాటు ఇతర రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సమన్వయం చేసుకుని చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను ఆదేశించారు. రాష్ట్రపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఇంధన శాఖకు సూచించారు.
డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.