90 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్ – బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ దర్యాప్తు బృందానికి ఐజీ రమేష్ సారథ్యం వహిస్తాడని తెలిపారు. ఎం. రమేష్ తో పాటు ఎస్పీ లు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ లు కూడా ఈ టీంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన రెండు కేసులు నమోదు చేశామన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట తోపాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. 25 మంది టాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన నటులతో పాటు యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేశామన్నారు.
ఈ రెండు కేసుల ను కూడా సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించామన్నారు డీజీపీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పలువురు వీటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 11 మంది యూట్యూబర్స్ తో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు బాలకృష్ణ, ప్రభాస్, షారుక్ ఖాన్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ, రీతూ చౌదరి, శ్యామల, ప్రకాశ్ రాజ్ , తదితరులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు విష్ణు ప్రియ, రీతూ విచారణకు హాజరయ్యారు. వీరి మొబైల్స్ ను సీజ్ చేశారు. మిగతా వారికి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు.