తెలంగాణలో ఏఐ సిటీ ఏర్పాటు
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
హైదరాబాద్ – రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేకంగా 50 నుంచి 100 ఎకరాలలో ప్రత్యేకంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన సభ, శాసన మండలిలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. అంతే కాకుండా ఇంటర్నెట్‌ని ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం ప్రవేశ పెడుతుందన్నారు. పునరుద్ధరణ మార్గాన్ని ప్రారంభించడానికి ఈ బడ్జెట్ తమకు అవకాశం ఇస్తుందన్నారు.
1 లక్ష మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 2000 కోట్ల వ్యయంతో ITIలు మార్చనున్నట్లు స్పష్టం చేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.
ప్రభుత్వం త్వరలో మరో 2 హామీలను అమలు చేయనుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద, ఎల్‌పిజి సిలిండర్‌లు అర్హులైన కుటుంబాలకు రూ.500/-లకు మాత్రమే సరఫరా చేయనున్నట్లు చెప్పారు.. అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద, అర్హత ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ అందిస్తామన్నారు .
ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడం తమ ముందున్న లక్ష్యమన్నారు.
తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రాంతీయ అసమానతలను సమతుల్యం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.